అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా బెద్దమ సురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మ తన్ను లో నమ్మిన వేలుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మాయమ్మ కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్ ‘‘దుర్గాదేవి తల్లులందరికీ తల్లి.
ముగ్గురమ్మలు.. లక్ష్మీ, సరస్వతి పార్వతులకు మూలమైన తల్లి.
లోకాలన్నింటా నిండి ఉన్న శక్తి స్వరూపిణి. దేవతలకు శత్రువులైన రాక్షసుల తల్లులకు గర్భశోకాన్ని కలిగించిన తల్లి. అనగా లోకకంటకులైన రాక్షసులను సంహరించిన స్వరూపం.
తనను నమ్ముకున్న అష్టమాతృకలకు శక్తినిచ్చిన తల్లి.
అంత గొప్పదైన మా అమ్మ.. సముద్రమంత కరుణ కలిగిన దుర్గమ్మ.. నాకు దయతో కవిత్వ, మహత్వ, పటుత్వ సంపదలు ఇచ్చుగాక’’ అంటూ పోతానామాత్యులవారు అత్యంత అద్భుతంగా ఆ తల్లి గొప్పదనాన్ని వివరించారు.
అందుకే పోతనగారి భాగవతం అమృతతుల్యమై శాశ్వతత్వాన్ని పొందిందంటారు భక్తులు.
అమ్మలను కన్న దేవతా స్త్రీలైన వారి మనస్సుల యందు ఏ అమ్మవారు ఉన్నదో, అటువంటి అమ్మని మహత్వ, కవిత్వ, పటుత్వ, సంపదల్.
ఈ నాలుగింటి కోసము నమస్కరిస్తున్నాను. అటువంటి దుర్గమ్మ మాయమ్మ. ఇవీ ఆయన ఈ పద్యంలో చెప్పిన విషయములు.
మనము చెయ్యలేని ఒక చాలా కష్టమైన పనిని పోతనగారు చాలా తేలికగా, మనకు ప్రమాదం లేని రీతిలో మనతో చేయించడానికి ఈ పద్యాన్ని అందించారు.
అమ్మలగన్నయమ్మ ఎవరు? మనకి లలితాసహస్రం ‘శ్రీమాతా’ అనే నామంతో ప్రారంభమవుతుంది.
శ్రీమాతా అంటే ‘శ’ కార, ‘ర’ కార, ‘ఈ’ కారముల చేత సత్వ, రజస్తమోగుణాధీశులైన శక్తి. బ్రహ్మశక్తి, రుద్రశక్తి, విష్ణుశక్తి. సరస్వతి, పార్వతి, లక్ష్మీదేవి, ఈ ముగ్గురికీ అమ్మ.
ఈ మూడు శక్తులను త్రిమూర్తులకు ఇచ్చినటువంటి పెద్దమ్మ ఎవరో ఆ యమ్మ, అంటే, ‘లలితాపరాభట్టారికా’ స్వరూపం. ఈ అమ్మవారికి, దుర్గా స్వరూపమునకు బేధం లేదు.
ముగ్గురమ్మల మూలపుటమ్మ, అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతులుగా కొలిచే తల్లులు. ‘చాలా పెద్దమ్మ’, అనగా మహాశక్తి. అండపిండబ్రహ్మాండం అంతటా నిండిపోయిన బ్రహ్మాండమైన శక్తి స్వరూపం. శక్తి స్వరూపం చిన్నా, పెద్దా బేధం లేకుండా సమస్త జీవులలో నిండిపోయినది. అలా ఉండడం అనేది మాతృత్వం. ఇది దయ. దీనిని సౌందర్యం అంటారు.
‘సురారులమ్మ, కడుపారడి బుచ్చినయమ్మ’, అనగా దేవతలకు శత్రువైన వాళ్ళ అమ్మ అనగా ‘దితి’. దితి, అయ్యో! అని ఏడ్చేటట్లుగా ఆవిడకు కడుపు శోకమును మిగిల్చింది, అనగా రాక్షసులు నశించడానికి కారణమైన అమ్మ. ‘తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబున నుండెడి అమ్మ’. అనగా మనకి అష్టమాత్రుకలు బ్రాహ్మి, మహేశ్వరి, వైష్ణవి, మహేంద్రి , చాముండా, కౌమారి, వారాహి, మహాలక్ష్మి. ఈ అష్టమాత్రుకలు శ్రీచక్రములో దేవతలుగా ఉంటారు. వీరు నిరంతరం అమ్మవారిని లోపల కొలుస్తూ ఉంటారు.
ఈ అష్టమాత్రుకలకు శక్తిని ఇచ్చిన అమ్మవారు ఎవరో ఆవిడే వేల్పుటమ్మల మనంబున ఉండెడి యమ్మ. ‘దుర్గ మాయమ్మ’ ఈ దుర్గమ్మ ఉన్నదే ఆవిడే లలితాపరాభట్టారికా. ఆ అమ్మ, మా యమ్మ. ‘మహత్వ, కవిత్వ, పటుత్వ, సంపదల్, అంటే ఇప్పుడు ఆవిడ నాకు దయతో మహత్వ, కవిత్వ, పటుత్వ, సంపదలను ఇవ్వాలి. నాకు అర్హత ఉన్నది అని ఇవ్వఖ్ఖర్లేదు. దయతో ఆ తల్లి ఇచ్చెయ్యాలి. అమ్మవారికి శాక్తేయ ప్రణవములు అని కొన్ని బీజాక్షరములు ఉన్నాయి. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌహ్ అని పిలుస్తారు.
వీటిని ఎలా పడితే అలా ఉపాసన చెయ్యకూడదు. కాని, ఇప్పుడు పోతనగారు ఒక గొప్ప ప్రయోగం చేశారు. మహత్వమునకు, బీజాక్షరము ‘ఓం’, కవిత్వమునకు, బీజాక్షరం ‘ఐం’, పటుత్వమునకు, భువనేశ్వరీ బీజాక్షరము ‘ హ్రీం’, ఆ తరువాత సంపదల్, లక్ష్మీదేవి ‘శ్రీం’. ఓం, ఐం, హ్రీం, శ్రీం, అమ్మలగన్నయమ్మ ‘శ్రీమాత్రేనమః’. మనము అస్తమానమూ బీజాక్షరాలను పలకటానికి వీలులేదు కాని, మనం రైలులో కూర్చున్నా, బస్సులో కూర్చున్నా, స్నానం చెయ్యకుండా ఎక్కడ ఉన్న కూడా, సౌచంతో ఉన్నామా లేదా అని కాకుండా ‘ఈ అమ్మలగన్నయమ్మ’ శ్లోకం అంటూ ఉన్నామనుకోండి, మనము మనకి తెలియకుండానే ఓం, ఐం, హ్రీం, శ్రీం, శ్రీమాత్రేనమః అనేస్తున్నామన్నమాట. మనము అస్తమానం ఆ తల్లిని ఉపాసన చేస్తున్నట్లే.