TAKE MORE CARE IN 10th EXAMS

 

➡పది పరీక్షల్లో చిన్నపాటి తప్పిదాలతో మార్కులు కోల్పోతున్న విద్యార్థులు

➡తొలిసారి రాసే పబ్లిక్‌ పరీక్షలు కావడంతో పిల్లల్లో ఒత్తిడి, తడబాటు

➡కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మేలంటున్న నిపుణులు

✍పగలూరాత్రీ చెమటోడ్చి చదవటమే కాదు.. అలా చదివింది, తప్పిదాలకు తావీయకుండా పరీక్షల్లో సమర్థంగా రాయగలిగినప్పుడే చక్కని ఫలితం చేజిక్కుతుంది. నిపుణులు చెప్తున్నదదే..పదో తరగతి పరీక్షలు రాసేటపుడు దొర్లే చిన్నాచితకా పొరపాట్లు ఫలితాల్లో విద్యార్థుల అంచనాలను తలకిందులు చేస్తుంటాయి.

✍ఒక మార్కు తగ్గినా పరీక్ష తప్పవచ్చు. పదికి పది గ్రేడ్‌ చేజారవచ్చు. ఇలాంటి తప్పిదాల కారణంగా ప్రతిభావంతులు సైతం ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశం కోల్పోతుంటారు. కచ్చితంగా పాసవుతామనుకునే విద్యార్థులు తప్పుతుంటారు. పరీక్షలకు బాగా సన్నద్ధమయ్యామని, ఉత్తమ శ్రేణి సాధిస్తామని ఆత్మవిశ్వాసంతో పరీక్షా కేంద్రంలోకి అడుగుపెట్టే విద్యార్థులు ఫలితాల నాడు బిక్కముఖం వేస్తుంటారు.

✍ఈ నేపథ్యంలో పరీక్షల్లో ఎక్కువ శాతం మంది విద్యార్థులు చేసే సాధారణ తప్పిదాలు ఏమిటి? ఆశించిన రీతిలో అధిక మార్కులు సాధించాలంటే పరీక్ష కేంద్రంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఏయే మెలకువలను అనుసరించాలి?.. తదితర ప్రశ్నలను పలువురు ప్రధానోపాధ్యాయులు, సబ్జెక్టు నిపుణుల సమాధానాల సమాహారమే ‘పది’ పరీక్షల ముంగిట ఈ కథనం..

🔹సబ్జెక్టుల వారీగా జాగ్రత్తలు..

➡గ్రాఫులు, పటాలు, బొమ్మలను పెన్సిలుతోనే గీయాలి. పెన్నులు, స్కెచ్‌ పెన్నులు వాడకూడదు.

➡సాంఘిక శాస్త్రంలోని సమకాలీన అంశాలలో మూసధోరణులకు ప్రాధాన్యం తగ్గించి, సొంత అవగాహనతో నిత్య జీవిత ఉదాహరణలు అన్వయిస్తూ రాయడం మేలు.

➡గణితం, భౌతిక, జీవ, సాంఘిక శాస్త్రాల్లో సమాధానాలు రాసేటప్పుడు మొదట 2 మార్కులవి, తర్వాత ఒక మార్కువి రాయాలి. చివరగా 4 మార్కుల సమాధానాలు రాస్తే మంచిది.

➡ఆంగ్లం, తెలుగు, హిందీలో వ్యాకరణ, అక్షర దోషాలు లేకుండా జాగ్రత్త పడటం చాలా ముఖ్యం.

➡భౌతికశాస్త్రంలోని సమస్యల(ప్రాబ్లెమ్స్‌)లో ప్రమాణాలను రాయడం మరిచిపోరాదు. ఉదాహరణకు సెంటీ మీటరు, గ్రాము, జౌలు, వాట్స్‌ తదితరాలు.

➡జీవశాస్త్రంలో ప్రయోగాలకు చెందిన జవాబులను రాసేటప్పుడు సంబంధిత బొమ్మలను కూడా తప్పక వేయాలి.

🔹ఎక్కువ మంది చేసే తప్పులు

➡ప్రశ్నపత్రంలోని ప్రశ్నలు విద్యార్థుల పరిశీలన, విశ్లేషణ, అవగాహన శక్తిని వెలికితీసేలా ఉంటాయి. అందుకే ప్రశ్నపత్రాన్ని చదవడానికే పావుగంట సమయం ఇచ్చారు. సుమారు 75శాతం మంది ప్రశ్నపత్రాన్ని తీసుకున్న 5 నిమిషాల్లోనే జవాబులు రాయటం మొదలెడుతున్నారు. ఇది సరికాదు. ముందుగా ప్రశ్నలను బాగా చదవాకే సమాధానాలు రాయటం ఆరంభించాలి.

➡సమాధాన పత్రాలతో కూడిన బుక్‌లెట్‌ ఇవ్వగానే ముందుగా ప్రతి పేజీకి ఎడమవైపు 2-2.5సెంటిమీటర్లు ఉండేలా మార్జిన్‌ వదలాలి. పేపరు దిద్దేవారు మార్కులు వేయటానికి ఇది అవసరం. లేకపోతే ఒక్కోసారి జవాబుకు వేసిన మార్కులు కనిపించక లెక్కవేయడం మరిచిపోతుంటారు. దీన్ని చాలామంది విద్యార్థులు పాటించరు.

➡ప్రశ్నపత్రంలో బాగా వచ్చిన ఏ ప్రశ్నకైనా ముందుగా జవాబు రాయొచ్చు. ఆ ప్రశ్న నంబరును ఎడమవైపు మార్జిన్‌లో తప్పక వేయాలి. ప్రశ్నల నంబర్లు తప్పుగా వేయడం, మరిచిపోవడం చేసేవారు 1% వరకు ఉంటారు.

➡ఎర్ర సిరా ఉండే (బాల్‌)పెన్ను వాడకూడదు. నీలం బ్లూ, నలుపు సిరా ఉండేవాటినే ఉపయోగించాలి.

➡పెద్దపెద్ద అక్షరాలతో, మరీ ఎక్కువ మార్జిన్‌ వదిలి భారీగా పేజీలు నింపడం వల్ల ప్రయోజనం శూన్యం. దీనివల్ల దిద్దేటప్పుడు ఉపాధ్యాయులు అసహనానికి లోనయ్యే అవకాశం ఉంది. ప్రతి పుటకు 20-25 వాక్యాలు రాస్తే మేలు.

➡జవాబులను వ్యాసంలా కాక బుల్లెట్‌ పాయింట్ల రూపంలో రాయాలి. దానివల్ల మూల్యాంకనం చేసే వారికి సులభంగా అర్ధమవుతుంది. ఇలా రాసేవారు 50 శాతానికి మించడం లేదు.

➡రాయాల్సినవన్నీ పూర్తయ్యాకే ఐచ్ఛిక(ఛాయిస్‌) ప్రశ్నలు రాయడానికి ప్రయత్నించాలి. లేకుంటే సమయం సరిపోక ఇబ్బంది తలెత్తే అవకాశముంది.

➡పేజీ చివర కొంత ప్రదేశం మిగిలిందని ఇంకో జవాబు రాయటం, పదాన్ని విడకొట్టి రాయటం చేస్తున్నారు. దీన్ని పరిహరించాలి.

➡బిట్‌ పేపర్‌లో కొట్టివేతలు, దిద్దివేతలు ఉండరాదు. బ్రాకెట్‌లో ఒకటి రాసి, మళ్లీ కొట్టివేసి బయట రాస్తున్నారు. ఇలా చేయటం సరికాదు.

➡సాధ్యమైనంతవరకు 10-15 నిమిషాలు ముందే పరీక్ష రాయటం పూర్తిచేయాలి. రాసిన జవాబులు, ప్రశ్నల నంబర్లను మరోసారి పరిశీలించుకోవాలి.

🔹పునరావృతమైతే కష్టమే.

✍ఏపీలో పదో తరగతి పరీక్షలు ఈనెల 18 నుంచి ప్రారంభమై ఏప్రిల్‌ 3తో ముగుస్తాయి. ఎంత కష్టపడి చదివినా పరీక్షల్లో ఏం రాయగలిగాం, ఎంత బాగా రాయగలిగామన్నదే ప్రధానం.

✍ఏడాది పొడవునా ముందస్తు పరీక్షలు ఎన్ని నిర్వహించినా.. వార్షిక పరీక్షల్లో విద్యార్థులు మరెన్నో పొరపాట్లు చేస్తున్నారు. సాధారణ పరీక్షల్లో జరిగే తప్పుల వల్ల నష్టం ఏమీ లేకుండవచ్చు. కానీ, చివరి పరీక్షల్లో అవే పొరపాట్లు పునరావృతమైతే జరిగే నష్టం అపారమని ఉపాధ్యాయులు హెచ్చరిస్తున్నారు.

✍ఉన్నత చదువులకు పదోతరగతి తొలిమెట్టని, పరీక్షల సమయంలో పొరపాట్లు చేయకుండా ఎక్కువ మార్కులు సాధిస్తే వారి భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని కృష్ణా జిల్లా నిడమానూరు జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బట్టు సురేష్‌కుమార్‌, గుంటూరు జిల్లా, సత్తెనపల్లి మండలం దూపాళ్ల ఉన్నత పాఠశాల భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు టి.శ్రీనివాసరావు వెల్లడించారు.

✍మొదటిసారి రాసే పబ్లిక్‌ పరీక్షలు కావడంతో విద్యార్థులు ఒత్తిడి, తడబాటుకు గురయ్యే అవకాశం ఉంటుందని వారు పేర్కొన్నారు.

 

HOME

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *