కాకి – నక్క కథ

కాకి-నక్క

ఒక అడవిలో చాలా తెలివైన కాకి ఒకటి ఉండేది. దానికి ఒకరోజున మాంసపు ముక్క ఒకటి దొరికింది.

అది ఒక చెట్టు కొమ్మమీద కూర్చొని , తీరికగా దాన్ని తినేందుకు సిద్ధమౌతున్నది.

అప్పుడే అటువైపుగా పోతున్న నక్క, తలెత్తి పైకి చూసింది.

మాంసపు ముక్కను పట్టుకున్న కాకి కనబడింది దానికి.
నక్కకు నోట్లో నీళ్లూరాయి. ‘కాకిని ఎలాగైనా మోసంచేసి, మాంసపు ముద్దను కొట్టేద్దాం’ అనుకున్నది. “కాకమ్మా! కాకమ్మా!” పిలిచింది నక్క.

కాకి తినటం ఆపి, నక్క వైపు చూసింది.

“నువ్వు ఎంత బాగా పాడతావు కాకమ్మా! నీ పాట వినాలని, నిన్ను వెతుక్కుంటూ వచ్చాను” అన్నది నక్క.

“అబ్బ! అప్పుడే చూసేశావన్నమాట, నా మాంసం ముక్కని” అనుకున్నది కాకి.
“చక్కగా పాడవమ్మా, ఓ పాట, మా చక్కని కాకమ్మా” అన్నది నక్క, కాకిని ఉబ్బిస్తూ.

కాకి మాంసం ముక్కని నోట్లోంచి తీసి, కాలి సందుల్లో పెట్టుకున్నది. ఆపైన చాలా మామూలుగా “కావ్! కా..వ్! కా….వ్!!” అని అరిచింది.

‘క్రిందికి పడాల్సిన మాంసంముక్క పడలేదేమిటా’ అని ఆశ్చర్యపోయింది నక్క.

కాకి తెలివిని చూసి కొంచెం కలవర పడింది.

“అబ్బబ్బ! ఎంత చక్కగా పాడావమ్మా! అలాగే నీ చక్కని అడుగులతో నాట్యం కూడా చెయ్యమ్మా! నా కనుల నిండుగా చూసేసి పోతాను” అన్నది నక్క, తెలివిని ప్రదర్శిస్తూ.

“అయ్యో, నక్కా! నీ గురించిన కథని మా అమ్మమ్మ ఎన్ని సార్లు చెప్పిందో లెక్కలేదు. ఇంకా నేను మోసపోతాననుకున్నావా?” అనుకున్నది కాకి.

మాంసం ముక్కని తీసి నోట్లో పెట్టుకొని, గాలిలోకి ఎగిరి పల్టీ కొట్టి, అటూ ఇటూ ఊగి, విన్యాసాలు చేసి చూపించింది నక్కకు.

‘మాంసం ముక్క ఇంకా దొరకలేదేమా’ అని నక్కకు విచారం వేసింది. అయినా పైకి కనబడనివ్వలేదు. అన్నది.

“అయ్యయ్యో , కాకమ్మా! నీ ఆటకి తోడుగా నీ పాటే ఉంటే ఎంత బాగుంటుందమ్మా! ఒకేసారి ఆడి, పాడి నన్ను మురిపించమ్మా, ఓ‌ చక్కని బొమ్మా!” అన్నది.

కాకి ఆలోచించింది. మాంసం ముక్కని తీసి, జాగ్రత్తగా చెట్టు కొమ్మల్లో ఇరికించి పెట్టింది.

“కావ్! కా..వ్!” మని పాడుతూ, సంతోషంగా ఎగిరి గంతులు వేసింది. “నీ జిత్తులిక సాగవు నక్క బాబూ! ఇక ఇంటికి పో, మాంసం నీకు ఎలాగూ దొరకదు!” అన్నది.

తన ఆటలు సాగనందుకు విచారపడుతూ నక్క ముందుకు సాగిపోయింది.

కాకి నవ్వుకొని, మాంసం ముక్కను మెల్లగా కొరుక్కుని కొరుక్కుని తిన్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *