ఎంత మంచి ఎలుకలో
ఎంత మంచి ఎలుకలో : గూడులో ఉన్న పక్షి పిల్లలకు ఆహారం తేవడానికి పొద్దున్నే బయలుదేరింది పక్షుల జంట. కొంత సేపటికి గూట్లోని పక్షి పిల్లల్లో ఒకటి అటూ ఇటూ కదులుతూ గూటి నుంచి పట్టు తప్పి కింద పడిపోయింది.
అదృష్టవశాత్తు ఆ బుజ్జి పిల్ల చెట్టు కింద ఉన్న ఒత్తైన గడ్డిలో పడింది. ఏం జరిగిందో అర్థంకాక అది భయంతో కిచకిచలాడసాగింది.
అప్పుడే అటుగా వచ్చిన సుధ, కిరణ్‌లు ఆ పక్షి పిల్ల పరిస్థితిని గమనించి, మెల్లగా చేతిలోకి తీసుకున్నారు. తమతోపాటు ఇంటికి తీసుకెళ్లి దానికి తినడానికి ఆహారం, బుజ్జి పళ్లెంలో నీళ్లు పెట్టారు.
అది ఆవురావురుమని ఆహారం తిని, కొన్ని నీళ్లు తాగింది.
కిరణ్ వాళ్లింట్లో పాత సామాను గదిలోకి వెళ్లి వాళ్ల తాతయ్య ఎప్పుడో కొన్న సన్న తీగల పంజరం బయటకు తెచ్చి, ఆ బుజ్జి పిట్టను అందులో పెట్టాడు.
మరి దానికి కాస్త గాలి, వెలుతురు కావాలి కదా! అందుకని ఆ పంజరాన్ని వరండాలో తగిలించాడు.
మధ్యాహ్నానికి పిల్లలను చూసుకోవడానికి తల్లి, తండ్రి పక్షులు వచ్చాయి. అంతే వాటి గుండె ఆగినంత పనైంది.
రెండు పిల్లల్లో ఒకటి కనిపించలేదు మరి! అవి దిగులుగా అరుస్తూ అటూ ఇటూ చెట్టు కింద వెతికాయి. అయినా ప్రయోజనం లేకపోయింది.
వాటికి దగ్గర్లోనే రెండు ఎలుకలు కనిపించాయి. అవి వాటి దగ్గరికి వెళ్లి ‘మిత్రులారా.. మా బుజ్జి పిల్ల ఒకటి గూట్లో కనిపించట్లేదు. దాన్ని మీరేమైనా చూశారా?’ అని అడిగాయి.
‘ఆ చూశాం.. ఆ పిల్ల కింద పడితే, ఓ అబ్బాయి, అమ్మాయి అదిగో.. ఆ పెద్ద ఇంట్లోకి తీసుకెళ్లారు. వాళ్లింట్లో వెతకండి. మాకు పొద్దున్నుంచి సరైన తిండి దొరకలేదు.
ఆ చెట్టు మీద రెండు జామపండ్లు కోసి కింద పడవేస్తే మా ఆకలి తీర్చుకుంటాం. మీకు చేతనైన సహాయం చేస్తాం’ చెప్పాయి ఎలుకలు.
వెంటనే జామ చెట్టుకున్న రెండు పండ్లు కోసి కింద పడవేశాయి పక్షులు. ఎలుకలు కృతజ్ఞతలు చెప్పి వాటిని తిన్నాయి.
తల్లి, తండ్రి పక్షులు ఎగురుకుంటూ ఆ పెద్ద ఇంటి వైపు వెళ్లాయి. బుజ్జి పక్షి అరుపు వాటికి వినపడింది.
‘మేమున్నాం భయపడకు’ అన్నట్టుగా అరుస్తూ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే వరండాలో పంజరంలో ఉన్న వాటి బుజ్జి పిల్ల కనిపించింది.
దాని ముందు ఆహారం, నీళ్లు చూసి ఆ ఇద్దరు పిల్లలకు అవి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాయి.
వెంటనే తల్లి, తండ్రి పక్షులు వాటి పక్షి స్నేహితుల్ని కలిసి విషయమంతా చెప్పాయి.
తమ పిల్లను వెనక్కు తీసుకురావడానికి సహాయం అడిగాయి. ‘మనలో మనం సహాయం చేసుకోకపోతే ఎలా? తప్పక సహాయం చేస్తాం’ అని అవి మాటిచ్చాయి.
తల్లి, తండ్రి పక్షులతో మరో ఆరు పక్షులు కలిసి ఆ ఇంటి దగ్గరకు వెళ్లాయి. మరి పంజరం జాగ్రత్తగా తీసుకురావాలి కదా! తండ్రి పక్షి పొడవైన గట్టి కొమ్మ తెచ్చింది.
దాన్ని పంజరం పైన ఉన్న కొక్కీలో పెట్టి ఇటు మూడు అటు మూడు కలిసి జాగ్రత్తగా పట్టుకుని గూడున్న చెట్టు దగ్గరకు తీసుకెళ్లాయి.
దూరం నుంచి ఎలుకలు పంజరాన్ని చూసి పరుగెత్తుకుని వచ్చాయి.
‘మా పిల్ల ఉన్న బోనునైతే ఎలాగోలా కష్టపడైతే తెచ్చాం కానీ.. దాన్ని బయటకు ఎలా తీసుకురావాలో తెలియడం లేదు’ అని విలపించాయి పక్షులు.
‘మీరేం భయపడకండి, పిల్లను బయటకు తెచ్చే బాధ్యత మాది’ అని ఎలుకలు పంజరం తలుపుకున్న కొక్కీని అతి కష్టం మీద తీశాయి.
పిల్ల పక్షి సంతోషంతో కిలకిలలాడుతూ తల్లి, తండ్రి పక్షులను చేరింది. మంచి మనసుతో మేలు చేసిన ఎలుకలకు కృతజ్ఞతలు చెప్పాయి. వీలున్నప్పుడల్లా వాటికి పండ్లు తెచ్చి ఇచ్చేవి.