హీనగుణమువాని నిలుజేరనిచ్చిన
నెంతవానికైన నిడుము గలుగు
ఈగ కడుపు జొచ్చి యిట్టట్టు సేయదా
విశ్వదాభిరామ వినురవేమ
తాత్పర్యం:
ఈగ కడుపు లోపలికి పోతే వికారపెట్టినట్టుగానే, నీచమైన మనస్తత్వం కలవాడిని ఇంటికి రానిచ్చినట్లయితే ఎవరికైనా సరే కీడు జరుగుతుంది.
ఈగ అంటే చిన్న ప్రాణైన బాక్టీరియాగా తీసుకుంటే, అది మనిషి లోపల ఆరోగ్యపరంగా ఎంత నష్టం కలిగిస్తుందో అందరికీ తెలుసు. నీచమైనవారిని దగ్గరకు చేర్చుకున్నా అదే విధంగా నష్టం చేకూరుతుందంటారు వేమనాచార్యులవారు. సృష్టిలోని ప్రాణికోటినంతా సమానంగా చూసే ఒక యోగి ఈ మాటలు చెప్తున్నారంటే దానికి అర్థమేమిటో జాగ్రత్తగా పరిశీలించాల్సిందే. ఏవేవో కారణాలు చెప్పి ఇంట్లో దూరి దోచుకున్నవారి గురించి వార్తలు వింటుంటాం. అవన్నీ సంపదలకు కలిగే నష్టాలు.
ప్రతి మనిషికీ అంతరంగంలోనూ బాహ్యంలోనూ కూడా తనదంటూ ఒక ప్రపంచముంటుంది. దీన్నే ప్రైవసీ అంటారు. నా అనుకునేవారికి అందులో స్థానమిస్తుంటారు. ఇంట్లో ఉన్న ఖరీదైన, ఆకర్షణీయమైన, అరుదైన, హోదాను తెలియపరచే వస్తువులను చూపించుకునే అలవాటు ఎలా ఉంటుందో, కొందరికి వారి గురించి వారు గొప్పగా చెప్పుకునే అలవాటు కూడా ఉంటుంది. అలాంటప్పుడు తనకి తెలియకుండానే తన గురించిన ఎన్నో వివరాలను చెప్పేస్తుంటారు. భౌతికంగానే రానిస్తేనే కాదు ఇది కూడా వారిని తన ఇంట్లోకి రానిచ్చినదానితో సమానం. ఈ కాలంలో ఇమెయిల్స్, ఫేస్ బుక్ లలోని వివరాలు ఇతరులకు తెలియటం వలన జరిగిన సైబర్ క్రైంల వలన కలిగిన నష్టాలు ఎన్నో వార్తల్లో వచ్చాయి.
అందువలన, మన ప్రైవసీలోకి రానిచ్చేముందు ఎదుటివారి గురించి క్షుణ్ణంగా తెలిస్తేనే అందుకు అనుమతించాలి. లేకపోతే వైరస్ వాతపడటం ఖాయమని వేమన అప్పటి భాషలో చెప్పారు.
*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*