హోమియోపతి గురించి తెలుసుకుందాం

హోమియోపతి గురించి తెలుసుకుందాం

మనకు ప్రాచీన కాలం నుండి అనేక వైద్య విధానాలు ఉన్నాయి. ఆయుర్వేదం, ఆక్యూ పంక్చర్, అల్లోపతి, హోమియోపతి వంటివి.

హోమియోపతీ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న ఒక వైద్యవిధానం. జర్మన్‌ దేశానికి చెందిన డా.

క్రిస్టియన్‌ ఫ్రెడ్రిక్‌ సామ్యేల్‌ హనెమన్‌ అనే ఫిజిషియన్‌ 1796లో ఈ వైద్యవిధానాన్ని, ఈ మాటని కనిపెట్టాడు.

మలేరియా వ్యాధి నివారణకు సింకోనబెరడుతో చేసిన మందువాడుతారని తెలుసుకున్న హనెమన్‌ ఆ బెరడు మలేరియాను ఏ విధంగా నివారిస్తుందో తెల్సుకోవాలనుకున్నాడు.

అందుకోసం సింకోనా బెరడుతో కషాయం తయారు చేసుకొని తనమీద తన స్నేహితులమీద ప్రయోగాలు జరిపి, ఏ ఔషదమైతే ఆరోగ్యవంతునిలో ఒక వ్యాధి లక్షణాలను కలుగజేస్తుందో ఆ లక్షణాలున్న వ్యాధికి ఆ ఔషదం ఇచ్చినప్పుడు వ్యాధి నయమవుతుందని తెలుసుకున్నాడు.

తన ప్రయోగ ఫలితాలను గురించి 1976లో లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురించడంతోపాటు, ఈ నూతన వైద్య విధానికి హోమియోపతిగా నామకరణం చేశాడు.

 

హోమియోపతి అన్నది హోమోయిస్ (ఒకే రకమైన), పేథోస్ (బాధ, రోగ లక్షణం) అనే రెండు గ్రీకు మాటలని సంధించగా పుట్టిన మాట.

కనుక కావలిస్తే దీనిని తెలుగులో సారూప్యలక్షణవైద్యం అనొచ్చు.

ఉష్ణం ఉష్ణేన శీతలం అన్నట్లు, వజ్రం వజ్రేనభిద్యతే అన్నట్లు ఒక పదార్థం ఏ బాధని కలిగిస్తుందో ఆ బాధని నివారించటానికి అదే పదార్ధాన్ని మందుగా వాడాలి అన్నది హోమియోపతీ మూల సూత్రం.

హోమియోపతి పితామహుడు డాక్టర్ శామ్యూల్ హానిమెన్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 10న ప్రపంచ హోమియోపతి దినోత్సవంను జరుపుకుంటారు.

 

రోగి ఎన్ని లక్షణాలు ఏకరవు పెట్టినా వాటన్నిటికి ఒకే ఒక మూల కారణం ఉంటుందనేది వీరి సిద్ధాంతం.

కనుక రోగి ఎన్ని లక్షణాలు ఏకరవు పెట్టినా వాటన్నిటికి ఒకే ఒక మందు ఇస్తారు – సనాతన హోమియోపతీలో.

మందుల ఖాతాలో ఉన్న ఏ మందు ఏ రోగికి నప్పుతుందో ఎంపిక చెయ్యటం చాల కష్టం. పది పుస్తకాలు చదివినంత మాత్రాన అబ్బే ప్రతిభ కాదు ఇది; అనుభవం ఉండాలి.

అందుకనే హొమియోపతీ వైద్యం అందరి చేతిలోనూ రాణించదని హోమియో పతి వైద్య నిపుణులు అంటున్నారు.మందును కూడా కొద్ది మొత్తంలోనే ఇస్తారు.

 

అయితే హోమియోపతీ మందు వేసుకున్న తరువాత శరీరంలోని రక్తంలో కాని, జీవకణాలలో కాని ఎటువంటి మార్పు వస్తుందో ప్రమాణాత్మకంగా రుజువు చేసి చూపించలేకపోతున్నారు.

ఎందుకంటే ఈ వైద్య విధానంలో ఆత్యాధునిక పరికరాలు ఉపయోగించుకుని ఎటువంటి పరీక్షలు చేయరు.

అందుకే ఈ విధానానికి పరిమితులు ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు. అల్లోపతి వైద్య విధానంలో ఎప్పటికప్పుడు నిరంతరం పరిశోధనలు జరుగుతాయి.

ఈ విధానంలో రోగికి తగిన పరీక్షలు చేస్తారు. వచ్చిన ఫలితాల ఆధారంగా మందులు ఇస్తారు.

అయితే అల్లోపతి వైద్య విధానం ప్రస్తుతం సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది.

అన్ని రకాల వైద్య విధానాలని ఓకే గొడుగు క్రిందకు తెచ్చే ప్రయత్నాన్ని కేంద్రం చేసింది.

ఏది ఏమైనా నాణ్యమైన వైద్య విధానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఏప్రిల్ 10 ప్రపంచ హోమియోపతి దినోత్సవం

 

 

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *