Why do we feel chill with fever ?
జ్వరంలోనూ వణుకు ఎందుకలా?
సాధారణంగా జ్వరం వచ్చిన వాళ్ళకి ఒళ్లు కాలిపోతున్నప్పటికీ, విపరీతమైన చలితో వణికిపోతూ దుప్పటి కప్పుకుంటారు కదా…! అసలు అంత వేడిలోనూ, వాళ్ళకి చలి ఎందుకొస్తుంది, దీనికి కారణమేంటి?
ఒక మనిషికి చలి వేస్తుందా, ఉక్కగా ఉందా? అనే విషయాలు ఆ వ్యక్తి శరీర ఉష్ణోగ్రతకు, వాతావరణ ఉష్ణోగ్రతకు మధ్య ఉన్న తేడాను బట్టి ఉంటుంది. వాతావరణ ఉష్ణోగ్రత, శరీర ఉష్ణోగ్రత దాదాపు సమానంగా ఉంటే ఆ వ్యక్తి ప్రశాంతంగా ఉంటాడు. శరీర ఉష్ణోగ్రత కన్నా బయటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే శరీరంలోకి ఆ బయటి ఉష్ణం చేరుకుంటుంది. ఇలాంటి అధిక వేడికి ప్రతిరూపంగా మనకు చెమట పట్టి, శరీర ఉష్ణోగ్రత క్రమబద్దం అవుతుంది. అలాంటప్పుడే మనకు ఉక్కపోస్తున్నట్లు అనిపిస్తుంది. శీతాకాలంలో బయటి ఉష్ణోగ్రత కన్నా శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలోనే మనం చలి అనే ఫీలింగ్ (భావన)కు లోనవుతాము.
సాధారణ పరిస్థితుల్లో వాతావరణ ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెంటిగ్రేడు ఉంటే, ఆరోగ్యవంతుడి శరీర ఉష్ణోగ్రత దాదాపు 37 డిగ్రీల సెంటిగ్రేడు (98.7 డిగ్రీల ఫారెన్ హీట్) ఉంటుంది. కాబట్టి ఉష్ణశక్తి వినిమయం శరీరం నుంచి బయటికి కానీ, బయటి నుంచి శరీరానికి కానీ పెద్దగా ఉండదు కాబట్టి అంత ఇబ్బందిగా ఉండదు. అయితే జ్వరంతో ఉన్న వ్యక్తి శరీర ఉష్ణోగ్రత సుమారు 40 డిగ్రీల సెంటిగ్రేడు (105 డిగ్రీల ఫారెన్ హీట్) వరకు ఉండవచ్చు. అంటే వాతావరణ ఉష్ణోగ్రత కన్నా 4 డిగ్రీల సెంటీగ్రేడు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి… జ్వరంతో ఉన్న మనిషి శరీరం నుంచి ఆ ఉష్ణశక్తి బయటికి వెళ్తుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆ మనిషికి చలి వేస్తుంది.