దుశ్శాసనుడు కథ
దుశ్శాసనుడు కథ : కౌరవులు నూరుగురు అన్నదమ్ములు. కాబట్టే “కౌరవసైన్యం” అన్నారు. అందరిలోకి పెద్దవాడు “ధుర్యోధనుడు”.నూరుగురు అన్నదమ్ముల తోడ ఒక సోదరి కూడా ఉంది. పేరు “దుస్సల”. సరే మరి దుశ్శాసునుడెవరు? ధుర్యోధనుని తమ్ముడు. కౌరవుల్లో రెండవవాడు. అంటే ధుర్యోధనుని తరువాత వాడన్న మాట. అయితే ద్రౌపతి వస్త్రాపహరణంలో ద్రౌపతిని వివస్త్రను చేయ ప్రయత్నించినవాడే దుశ్శాసనుడుగా మనందరికీ తెలుసు! దుశ్శాసనుడికి అన్నంటే అభిమానం. అందుకే ధుర్యోధనుడు ఏం చేసినా అందుకు సాయం చెయ్యడమేకాదు, ఆజ్ఞగా భావించి అమలు చేసినవాడు. దుర్యోధనునితో పోల్చుకుంటే దుశ్వాసనుకి అంత బుద్దిబలం కాదు కదా దేహం బలం కూడా లేదు. అన్నను చూసి, అంగబలం చూసి, అర్థ బలం చూసి గర్వపడడమే తెలుసు. విర్రవీగడమే తెలుసు.
పాండవులు జూదంలో ద్రౌపతిని కూడా ఓడిపోయారు. ధుర్యోధనుడు తన సేవకుడైన ప్రాతికామెను పంపి ఆమెను తీసుకు రమ్మన్నాడు. ద్రౌపది వేసిన ప్రశ్నకు పాత్రికామి జవాబు చెప్పలేక సభకు తిరిగొచ్చాడు. అతనికి తెలిసిన జవాబదే. ద్రౌపతి ఒక స్త్రీ అని గాని, తమ సోదరులైన పాండవుల భార్య అనిగాని అతనికి గుర్తే లేదు. చీర విప్పేందుకు కూడా వెనుకాడ లేదు. అయినా దుశ్శాసనుడి ప్రయత్నం నెరవేర లేదు. పట్టుదలకు పోయాడు. జబ్బలు నొప్పెట్టినా ఆగకుండా చీరను లాగుతూనే వున్నాడు. లాగిన చీర గుట్టంత కాదు, కొండత పోగు పడింది. “నీ రక్తంతో తడిపిగాని ఈ జుట్టును ముడవ”నని ద్రౌపది శపథం చేసింది. చూసి ఓర్వలేని భీముడు దుశ్శాసనుని గుండెను చీల్చి రక్తం తాగుతానన్నాడు. అయితే ఆ మాటలను కౌరవులెవరూ లక్ష్య పెట్టలేదు.
అలాగే అజ్ఞాతవాసంలో వున్న పాండవుల్ని గుర్తించి ఎలా వంచించాలా అని ధుర్యోధనుడు ఆలోచిస్తున్నప్పుడు ఆ అవసరం లేదన్నాడు దుశ్శాసనుడు. పాండవులెప్పుడో పరలోకాలకు పోయుంటారని పరిహాసమాడాడు.
కురుక్షేత్ర యుద్ధం మొదలైంది. కన్నూ మిన్నూ కానని దుశ్శాసనుడు అభిమన్యుడి ముందు నిలవలేక పారిపోయాడు. సాత్యకితో యుద్ధం చేసి ఓడిపోయాడు. సహదేవునితో యుద్ధం చేసి మూర్ఛపోయాడు. చివరకు భీముని చేతికి చిక్కి పోయాడు. భీముడి గదా ఘాతానికి దుశ్శాసనుడి గుండె బద్దలై రక్తం చిమ్మింది.
ప్రతిజ్ఞ ప్రకారం ఆ రక్తాన్ని తాగిన భీముడు ఆ చేతుల్ని ద్రౌపతి కురులకు రాయడంతో కొప్పు ముడి వేసుకుంది ద్రౌపది.
ఆడవాళ్ళని అవమానించి హింసించే వారికేగతి పడుతుందో దుశ్శాసనుడి కథ చెప్తుంది!.