కొన్నవీ పాయ. కొట్టుకొచ్చినవీ పాయ.
ఒక అడవిలో ఒక నక్క వుండేది. అది పెద్ద దొంగది. ఒకసారి దాని ఇంటిలో బియ్యం అయిపోయాయి.
దాంతో పక్కనే వున్న ఊరిలో కొందామని బండి కట్టుకోని అంగడికి బైలు దేరింది.
ఆ ఊరిలో రంగయ్య అనే అతను చాలా కాలం నుండి అంగడి నడుపుతూ వున్నాడు.
కానీ ఆ రోజు అతను పనిబడి పక్క ఊరికి పోతూ అంగడి చూసుకోమని తన కొడుకుకు అప్పజెప్పాడు.
సరుకులు కొనడానికి నక్క ఆ అంగడి దగ్గరికి వచ్చింది.
రంగయ్య కాక రంగయ్య చిన్న కొడుకు కనబడగానే… ఎలాగైనా సరే ఆ పిల్లోన్ని మోసం చేసి కొన్ని సరుకులు కొట్టెయ్యాలి అనుకుంది.
అంగడి బైట రకరకాల మూటలు వరుసగా కనబడ్డాయి.
నక్క ఆ పిల్లోనితో “ఏం అల్లుడూ బాగున్నావా… ఈ రోజు ఆడుకోకుండా నువ్వు ఒక్కనివే వున్నావేమి.
మీ నాయన ఎక్కడికి పోయినాడు” అంటూ తీయగా మాటలు కలిపి “ఒక బియ్యం మూట కావాలి. ఎంత” అని అడిగింది.
ఆ పిల్లోడు ధర చెప్పగానే “ఇదిగో డబ్బులు తీసుకో… సరిగా వున్నాయో లేదో లెక్కబెట్టుకో” అంటూ డబ్బులు చేతిలో పెడుతున్నట్టు దగ్గరికి తీసుకుపోయి, ఆ పిల్లోడు అందుకోకముందే వదిలేసింది. దాంతో ఆ డబ్బులన్నీ అంగడిలో చెల్లాచెదురుగా పడిపోయాయి.
దాంతో ఆ పిల్లోడు ఆ డబ్బులు ఏరుకుందామని కిందికి వంగాడు.
ఆ పిల్లోడు ఎప్పుడయితే అలా వంగాడో వెంటనే కన్ను మూసి తెరిచేంతలోగా ఆ దొంగనక్క అంగడి బైటున్న ఒక బొరుగుల సంచీని, చెక్కర సంచీని ఎత్తి బండిలో వేసి, అవి కనబడకుండా దుప్పటి కప్పేసి, ఏమీ ఎరగని నంగనాచిలా గమ్మున అమాయకంగా నిలబడింది.
ఆ పిల్లోడు కిందపడిన డబ్బులన్నీ ఏరి లెక్క చూసుకొని “సరిపోయినాయిలే నక్కమామా.. బియ్యం మూట తీసుకోపో” అన్నాడు.
నక్క అలాగేనని బియ్యం మూట ఎత్తి బండిలో వేసుకుంది. “చూడు బాబూ.. ఈ అడవిలో అందరూ నా మాదిరే మంచోళ్ళు వుండరు.
చాలామంది దొంగలు వుంటారు. రెప్ప మూసి తెరిచేంతలో మోసం చేయగలరు. చిన్న పిల్లోనివి. అటూఇటూ పోకుండా మీ నాయన వచ్చేవరకు అంగడిని బాగా కనిపెట్టుకొని వుండు” అని చెప్పి సంబరంగా తిరిగి బైలుదేరింది.
అది అలా కొంచ దూరం పోయాక ఒక్కసారిగా ఆకాశమంతా నల్లని మబ్బులు కమ్ముకున్నాయి. ఝమ్మని పెద్దగాలి లేచింది. అది అలాంటిలాంటి గాలి కాదు.
దాని దెబ్బకు బండి అటూఇటూ ఊగి పోసాగింది. ఆ గాలి వేగానికి బండిపైన కప్పిన దుప్పటి ఎగిరిపోయింది.
ఇంకేముంది… లోపల బొరుగుల మూట వుంది కదా… అది ఏమంత బరువు వుండదు కదా… దాంతో ఆ మూట ఒక్కసారిగా ఎగిరి బండిలోంచి దభీమని కింద పడింది.
అలా పడడం పడడం దానికి కట్టిన తాడు విడిపోయింది. అంతే… ఇంకేముంది సంచీలోంచి బొరుగులన్నీ రివ్వున గాలితో పాటు పైకి లేచాయి. ఆకాశమంతా తెల్లగా బొరుగులతో నిండిపోయింది.
నక్క అదిరిపడి “అయ్యో… నా బొరుగులు” అని బండి దిగి లబలబలాడుకుంటా వచ్చింది. కానీ అప్పటికే సంచీలో ఒక్క బొరుగు కూడా మిగల లేదు. అంతా ఖాళీ.
“అయ్యో… ఒక్క బొరుగు కూడా నోటిలో పెట్టుకొని కరకరా నమలక ముందే అన్నీ నేలపాలయి పాయెనే” అని బాధ పడతా మరలా బైలు దేరింది.
కానీ కొంచం దూరం పోయిందో లేదో ఆకాశమంతా కమ్ముకున్న నల్లని మబ్బుల నుంచి వాన మొదలైంది. లావు చుక్కలు టపటపమని ఆగకుండా ధారగా పడసాగాయి.
బండి ఎక్కడన్నా దారిలో ఆపుదామంటే అక్కడంతా చిన్న చిన్న మొక్కలే గానీ పెద్ద చెట్టు ఒక్కటి కూడా కనబడలేదు.
బండిలో చెక్కర మూట వుంది గదా… అది ఆ వానకు నిమిషాల్లో తడిసిపోయింది. ఇంకేముంది… మూటలోంచి చెక్కరంతా పాకంలా మారి కరిగిపోయి ఉత్త సంచీ మిగిలింది.
అది చూసి ఆ దొంగనక్క “ఆయ్యయ్యో… సంచీ చెక్కర… ఒక్క గుప్పెడు గూడా నోటిలో వేసుకొని తీయతీయగా చప్పరించక ముందే మొత్తం కరిగిపోయిందే” అని తెగ బాధ పడింది.
అంతలో ఆకాశంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మెరుపులు మెరిసి, గుండెలు అదిరిపోయేలా ఉరుములు ఉరిమాయి. ఆ చప్పుడుకు, మెరుపులకు భయపడిన ఎద్దులు వేగంగా పరుగులు తీశాయి.
అవి అలా అదిరిపడి వురుకుతా వుంటే దారిలో ఒక పెద్ద రాయి అడ్డం వచ్చింది. బండి గాను వేగంగా దానీ మీదకు ఎక్కేసరికి దాని గాను విరిగి పోయింది.
సరిగ్గా అక్కడొక పెద్ద మురికి గుంత వుంది. బండి సక్కగా పోయి ఆ మురికి గుంతలో పడింది. అంతే… నక్క కళ్ళముందే బండిలోని బియ్యం మూట ఎగిరి ఆ మురికి గుంతలో పడి మునిగిపోయింది. అది చూసి నక్క నోట మాట రాలేదు.
“కరకరలాడే బొరుగులూ దొరక లేదు. తీయతీయని చెక్కరా మిగల లేదు. వండుకునే బియ్యమూ దక్కలేదు. ఎక్కి వచ్చిన బండీ మిగల లేదు.
కొట్టు కొచ్చినవీ పోయాయి. కొనుక్కొచ్చినవీ పోయాయి. ఇదంతా ఆ చిన్న పిల్లోన్ని మోసం చేసినందుకే. ఇంకెప్పుడూ ఇలాంటి దొంగపనులు చేయగూడదు” అనుకొంది.