అబద్ధమని ఎవరైనా నిరూపిస్తే గొప్ప బహుమతి

అబద్ధమని ఎవరైనా నిరూపిస్తే గొప్ప బహుమతి

అబద్ధమని ఎవరైనా నిరూపిస్తే గొప్ప బహుమతి

ఒకానొక రాజు అన్నింటికీ వాగ్వివాదానికి దిగుతుండేవాడు. రాజు కాబట్టి ఆయనేమన్నా అందరూ కిమ్మనేవారు కారు. ఓసారి సభలో ‘నేను చెప్పినది అబద్ధమని ఎవరైనా నిరూపిస్తే గొప్ప బహుమతి ఇస్తాను’ అన్నాడు రాజు.

ఎవరూ మాట్లాడలేదు. విదూషకుడు మాత్రం లేచి ‘సరే మహారాజా’ అన్నాడు. ‘అయితే విను బంగారం బంగారమే. అదెక్కడున్నా దాని విలువ దానిదే. కాదంటావా?’ అన్నాడు రాజు నవ్వుతూ.

‘అది నిజం కాదు మహారాజా! వస్తువు విలువ దాని స్థానాన్ని బట్టి మారుతుంది’ అన్నాడు విదూషకుడు.

‘అలా అని నిరూపించగలవా?’ అన్నాడు రాజు. ‘మీ చేతికున్న బంగారు కడియాన్ని ఇలా ఇవ్వండి ప్రభూ’ అన్నాడు విదూషకుడు.

రాజు వెంటనే తీసి అందించాడు. విదూషకుడు దాన్ని ఓ భటుడికి ఇచ్చి, ‘మన నగరంలో నగల వ్యాపారి మాధవయ్య దగ్గరకి వెళ్లు. అత్యవసరంగా అమ్మాలని చెప్పి ఎంతకి కొంటాడో అడిగిరా’ అంటూ పంపాడు.

అలా వెళ్లిన భటుడు కాసేపటికి తిరిగి వచ్చి, ‘ఇరవె ౖవరహాలు ఇస్తానన్నాడు ప్రభూ’ అన్నాడు.

విదూషకుడు ఈసారి ధనాగారం పర్యవేక్షణ అధికారిని పిలిచి కడియం ఇచ్చి ‘మాధవయ్య దీన్ని ఎంతకు కొంటాడో కనుక్కో’ అని పంపాడు. కాసేపటికి తిరిగి వచ్చిన ఆ అధికారి, ‘నలభై వరహాలు ఇస్తానన్నాడు’ అన్నాడు.

తర్వాత విదూషకుడు దారినపోయే బీదవాణ్ణి పిలిచి ఇంతకు ముందులాగే మాధవుడి దగ్గరకు పంపాడు.

అతడి వెంట ఓ సైనికుడిని రహస్యంగా వెంబడించమన్నాడు. వర్తకుడి దగ్గరకు వెళ్లిన బీదవాడు కడియాన్ని ఇచ్చి, ‘అయ్యా! దీని ధర ఎంత?’ అని అడిగాడు.

వర్తకుడు వాడిని ఎగాదిగా చూసి పది వరహాలు వాడి చేతిలో పెట్టి, ‘దీన్ని నువ్వు ఎక్కడో దొంగిలించి ఉంటావు.

మర్యాదగా ఇది తీసుకుపో. లేదా ఫిర్యాదు చేస్తాను’ అంటూ దబాయించాడు.

ఆపై సైనికుడి ద్వారా జరిగిందంతా తెలుసుకున్న విదూషకుడు, రాజు కేసి తిరిగి ‘చూశారా మహారాజా! ఒకే నగ. ఒకే వర్తకుడు. భటుడికి ఒక విలువ, అధికారికి ఒక వెల, బీదవాడికి ఒక ధర చెప్పాడు.

వస్తువు విలువ అది ఉన్న స్థానాన్ని బట్టి మారుతుందని తేలిందిగా?’ అన్నాడు.

రాజు నవ్వేసి విదూషకుడికి బహుమతి ఇచ్చాడు.

 

HOME

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *