ఆకాశంలో అంత ఎత్తులో గద్ద రెక్కలాడించకుండా ఎలా ఎగరగలుగుతుంది?
ఎండుటాకులు, దూదిపింజెలు, వెంట్రుకల లాంటి తేలికైన వస్తువులు గాలిలో తేలుతూ చాలా సేపు కింద పడకుండా ఉండడం తెలిసిందే. అదే రాయిలాంటి వస్తువులు పైనుంచి కిందకి తటాలున పడిపోవడం కూడా మనకు తెలుసు. ఎత్తు నుంచి కిందకి పడే వస్తువుపై గాలి వల్ల ఏర్పడే నిరోధక బలం పని చేస్తూ ఉంటుంది. దీని ప్రభావం ఆయా వస్తువుల సాంద్రత, పరిమాణం, బరువులాంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. గద్ద విషయానికి వస్తే దాని రెక్కలు చాలా విశాలంగా ఉంటాయి. గద్ద పరిమాణం దాని బరువుతో పోలిస్తే చాలా ఎక్కువ. ప్యారాచూట్ కట్టుకున్నప్పుడు, గ్త్లెడర్ పట్టుకున్నప్పుడు మనుషులు ఎలాగైతే గాలిలో తేలుతూ ప్రయాణించగలరో గద్దకూడా అలా చేయగలదు. గద్ద ఆకాశంలోకి ఎగరడానికి మామూలుగానే రెక్కలు ఆడించినా, పైకి వెళ్లాక రెక్కలను విశాలంగా చాపి గాలి నిరోధాన్ని, గాలి వేగాన్ని ఉపయోగించుకుని బ్యాలన్స్ చేసుకుంటూ తన శక్తిని ఆదా చేసుకుంటుంది. మరింత ఎత్తుకు ఎగరాలంటే మాత్రం రెక్కలు అల్లల్లాడించవలసిందే.